Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.

63 దేవా, నీవు నా దేవుడవు.
    నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
    నీకొరకు దాహంగొని ఉన్నాయి.
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
    నీ బలము నీ మహిమలను నేను చూశాను.
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
    నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
    నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
    రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
    నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
    నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
    వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
    అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
    ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.

కీర్తనలు. 98

స్తుతి కీర్తన.

98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
    గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
    ఆయనకు విజయం తెచ్చింది.
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
    యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
    రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
    త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
    స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
బూరలు, కొమ్ములు ఊదండి.
    మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
భూమి, సముద్రం, వాటిలో ఉన్న
    సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
నదులారా, చప్పట్లు కొట్టండి.
    పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
    గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
    నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

కీర్తనలు. 103

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
    మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
    మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16     ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
    త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
    దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18     దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
    దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
    మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
    దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
    మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
    మీరు ఆయన సేవకులు,
    దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
    అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!

ఆదికాండము 13:2-18

ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.

అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబును విడిచిపెట్టి మళ్లీ వెనుకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

అబ్రాము, లోతు వేరుపడటం

ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి సరిపోలేదు. అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.

కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం. మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”

10 లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనము చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.) 11 అందుచేత యొర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. 12 అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు. 13 సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

14 లోతు వెళ్లిపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు. 15 నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. 16 భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. 17 కనుక వెళ్లు, నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”

18 కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.

గలతీయులకు 2:1-10

అపొస్తలులు పౌలును అంగీకరించటం

పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు. దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కానివాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.

నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు. మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం. సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.

సంఘంలో ముఖ్యమైనవాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు. పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు. పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కానివాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము. 10 మేము పేదవాళ్ళకు సహాయం చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే అభిలాష వుంది.

మార్కు 7:31-37

చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం

31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.

33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International