Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 31

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

31 యెహోవా, నీవే నా కాపుదల.
    నన్ను నిరాశపరచవద్దు.
    నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
    దేవా, నా మాట ఆలకించుము.
    వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
    నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
    కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
    వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
    నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
    నన్ను రక్షించుము.
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
    యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
    నా కష్టాలు నీవు చూశావు.
    నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
    వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
    నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
    నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
    నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
    నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
    నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
    వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
    నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
    ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.

14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
    నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
    కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
    మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
    మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
    కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
    నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
    ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
    కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
    ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
    కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
    యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

కీర్తనలు. 35

దావీదు కీర్తన.

35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
    నా యుద్ధాలు పోరాడుము.
యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
    లేచి, నాకు సహాయం చేయుము.
ఈటె, బరిసె తీసుకొని
    నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,

కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
    వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
    వారిని ఇబ్బంది పెట్టుము.
ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
    యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
    యెహోవా దూత వారిని తరుమును గాక!
నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
    నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
    వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
    తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
    ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
    యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
    అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
    ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
    కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
    ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
    నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
    ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
    ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
    వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
    ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.

17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
    ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
    నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
    శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
    వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
    కనుక మౌనంగా ఉండవద్దు.
    నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
    నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
    ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
    “యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
    నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
    కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
    మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
    నేను ప్రతి దినము స్తుతిస్తాను.

ఆదికాండము 11:27-12:8

తెరహు కుటుంబ చరిత్ర

27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి. 28 కల్దీయుల ఊరు అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా, ఇస్కాలకు హారాను తండ్రి. 30 శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.

31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనుమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు. 32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.

దేవుడు అబ్రామును పిలచుట

12 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,

“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
    నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
    నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
    నీ పేరు ఉపయోగిస్తారు.
నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
    నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
    నేను నిన్ను ఉపయోగిస్తాను.”

అబ్రాము కనానుకు వెళ్లుట

కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.

అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు.

ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

హెబ్రీయులకు 7:1-17

మెల్కీసెదెకు

ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.

మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.

మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.

ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.

11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.

యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు

15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.

యోహాను 4:16-26

16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.

17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.

యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.

19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.

21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.

25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.

26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International