Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

ఆదికాండము 4:1-16

ప్రథమ కుటుంబం

ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను[a] అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.

ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.

ప్రథమ హత్య

3-4 కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు.

హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును[b] అదుపులో పెట్టాలి.”

“మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు.

తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?”

అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు.

10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. 11 (నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”

13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! 14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”

15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.

కయీను కుటుంబం

16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.

హెబ్రీయులకు 2:11-18

11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:

“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
    సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(A)

13 మరొక చోట

“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(B)

అంతేకాక ఇలా కూడా అన్నాడు:

“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(C)

14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.

యోహాను 1:29-42

దేవుని గొఱ్ఱె పిల్ల

29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.

32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”

యేసు మొదటి శిష్యులు

35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. 36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.

37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. 38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు.

వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)

39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.

40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో 41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.

42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా[a] అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International