Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 1-4

మొదటి భాగం

(కీర్తనలు 1–41)

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
    అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
    అతడు పాపులవలె జీవించనప్పుడు,
    దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
    ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
    సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
    అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
    వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
    ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
    చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన

యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
    అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.

అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
    నీవే నా అతిశయం.
    యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[b] చేస్తావు.
యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
    ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!

నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
    ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
    కాని ఆ శత్రువులకు నేను భయపడను.

యెహోవా, లెమ్ము[c]
    నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
    వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.

యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
    యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.

సంగీత నాయకునికి: తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
    నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
    ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.[d]

ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
    ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.

యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
    నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
    కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
దేవునికి మంచి బలులు అర్పించండి.
    మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.

“దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
    యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందుచేత పంట కోత సమయంలో సంబరపడే దానికంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
    ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.

కీర్తనలు. 7

యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
    నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
    నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.

యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
    నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
    నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
    మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.

యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
    నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
    లేచి న్యాయంకోసం వాదించుము.
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
    వారి మీద పైనుండి పరిపాలించుము.
ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
    నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
    నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
చెడ్డవాళ్లను శిక్షించి
    మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
    మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.

10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
    కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
    మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
    ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
    అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
    అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
    ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
    అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.

17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

ఆదికాండము 2:4-25

మొదటి మనిషి, ఏదెను తోట

ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.

భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.

10 ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. 11 మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. 12 (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). 13 రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. 14 మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.

15 మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. 16 యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. 17 అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”

మొదటి స్త్రీ

18 అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.

19 పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. 20 సాధు జంతువులన్నింటికీ, ఆకాశ పక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. 21 అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్లు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని ప్రక్క ఎముకలలో ఒకదాన్ని తీశాడు. ప్రక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. 22 స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. 23 అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు:

“ఇప్పుడు, ఇది నావంటి మనిషే.
    ఆమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది.
    ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది.
ఆమె నరునిలోనుండి తీయబడింది
    గనుక ఆమెను నారి అంటాను.”

24 ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.

25 ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.

హెబ్రీయులకు 1

దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.

ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు:

“నీవు నా కుమారుడవు,
    నేడు నేను నీ తండ్రినయ్యాను.”(A)

మరొక చోట:

“నేనతనికి తండ్రి నౌతాను.
    అతడు నా కుమారుడౌతాడు.”(B)

మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు:

“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”(C)

దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ:

“దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను
    తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”(D)

కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు:

“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది.
    నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది.
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు.
    అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను
    అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”(E)

10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు:

“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు.
    ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి.
    కాని, నీవు చిరకాలం ఉంటావు.
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు.
    వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు.
కాని నీవు మాత్రం అలాగే ఉంటావు!
    నీ సంవత్సరములకు అంతంలేదు!”(F)

13 దేవుడు ఏ దేవదూతతోనైనా:

“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు
    నా కుడివైపు కూర్చో,”(G)

అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?

యోహాను 1:1-18

వాక్యము మానవాతారం ఎత్తటం

సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.

దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.

10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.

14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”

16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International