Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 85

సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన

85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
    యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
    వారి పాపాలు తుడిచివేయుము.

యెహోవా, కోపంగాను,
    ఆవేశంగాను ఉండవద్దు.
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
    మమ్మల్ని మరల స్వీకరించు.
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
    నీ ప్రజలను సంతోషింపజేయుము.
యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
    మమ్మల్ని రక్షించుము.

దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
    తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
    ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
    మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
    మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
    పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
    భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
    ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.

కీర్తనలు. 87

కోరహు కుమారుల స్తుతి కీర్తన.

87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
    ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.

దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
    ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
సీయోనుగడ్డ మీద జన్మించిన
    ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
    సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
    ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.

దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
    “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.

కీర్తనలు. 89:1-29

ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.

89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
    ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
    నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!

దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
    నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
    నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
    ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.

యెహోషువ 3:14-4:7

14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు. 15 (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు. 16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు. 17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.

ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు

ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”

కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”

ఎఫెసీయులకు 5:1-20

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.

కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.

వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:

“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
    బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”

15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.

యోహాను 9:1-12

యేసు ఒక పుట్టు గ్రుడ్డివానిని నయం చేయటం

ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు. ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు.

యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు. ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.

ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు. అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం “పంపబడిన వాడు.” ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు.

అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు.

కొందరు, “ఔనన్నారు. మరికొందరు, కాదు ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు.

కాని అతడు స్వయంగా, “నేనే అతణ్ణి” అని అన్నాడు.

10 “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు.

11 అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు.

ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు.

యోహాను 9:35-38

ఆత్మీయ అంధత్వము

35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.

36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.

37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.

38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International