Book of Common Prayer
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.
18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
అతడీలాగన్నాడు.
2 యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
3 యెహోవాకు నేను మొరపెడ్తాను.
యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
6 చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
7 యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు.
భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి.
ఎందుకంటే ప్రభువు కోపించాడు.
8 ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది.
యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి.
నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.
9 యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు.
ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.
10 ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు.
ఆయన గాలుల మీద పైకెగిరాడు.
11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మేఘంలో ఆయన మరుగైయున్నాడు.
దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.
12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది.
అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.
13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది.
సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు,
అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.
15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు,
మరియు నీవు నీ నోటినుండి[a] బలమైన గాలిని ఊదావు.
నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము.
భూమి పునాదులను మేము చూడగలిగాము.
16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు.
నా కష్టాల్లోనుండి[b] ఆయన నన్ను బయటకు లాగాడు.
17 నా శత్రువులు నాకంటె బలవంతులు.
ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.
18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు.
కాని యెహోవా నన్ను బలపర్చాడు.
19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు.
ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.
20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.
25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.
30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.
మన దేవుడు తప్ప మరో బండ[c] లేదు.
32 దేవుడు నాకు బలం ఇస్తాడు.
ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
33 దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె ఉంచుతాడు.
ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు.
ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.
34 యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు.
ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు.
35 దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి.
నీ కుడిచేతితో నన్ను బలపరుచుము.
నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది.
36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు.
నా పాదాలు జారిపోలేదు.
37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను.
వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.
38 నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు.
నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు.
39 దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము.
నా శత్రువులంతా నా యెదుట పడిపోయేటట్టు చేయుము.
40 యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు.
నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను.
41 నా శత్రువులు సహాయం కోసం అడిగారు,
కాని ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు.
వారు యెహోవాకు కూడా మొరపెట్టారు.
కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు.
42 నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను.
వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను.
43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.
ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము.
నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.
ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,
కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు.
వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.
46 యెహోవా సజీవంగా ఉన్నాడు.
నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు.
అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.
ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
48 యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.
కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు.
నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.
నీ నామ కీర్తన గానము చేస్తాను.
50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు,
తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.
13 పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.
14 ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు. 15 తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు. 16 కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు. 17 దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని త్రాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం త్రాగినట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.
1 దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా, 2 మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.
3 తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.
4 మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. 5 అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను. 6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.
7 యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. 8 పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది. 10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి. 11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.
12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం,[a] వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.
కానా పట్టణంలో వివాహం
2 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. 2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. 3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.
4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.
5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.
6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.
7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.
వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. 9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
© 1997 Bible League International