Book of Common Prayer
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
5 పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!
యెహోవాను స్తుతించండి.
ధర్మశాస్త్రము, వాగ్దానము
15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. 16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.[a] కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. 17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.
18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.
19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. 20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.
మోషే ధర్మశాస్త్రం యెక్క ఉద్దేశ్యం
21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. 22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది.
జెకర్యా చెప్పిన భవిష్యం
67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
యేసు వంశావళి
(లూకా 3:23-38)
1 యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.
2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకు కుమారుడు యాకోబు.
యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.
3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.)
పెరెసు కుమారుడు ఎస్రోము.
ఎస్రోము కుమారుడు అరాము.
4 అరాము కుమారుడు అమ్మీనాదాబు.
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
నయస్సోను కుమారుడు శల్మా.
5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.)
బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.)
ఓబేదు కుమారుడు యెష్షయి.
6 యెష్షయి కుమారుడు రాజు దావీదు.
దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)
7 సొలొమోను కుమారుడు రెహబాము.
రెహబాము కుమారుడు అబీయా.
అబీయా కుమారుడు ఆసా.
8 ఆసా కుమారుడు యెహోషాపాతు.
యెహోషాపాతు కుమారుడు యెహోరాము.
యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9 ఉజ్జియా కుమారుడు యోతాము.
యోతాము కుమారుడు ఆహాజు.
ఆహాజు కుమారుడు హిజ్కియా.
10 హిజ్కియా కుమారుడు మనష్షే.
మనష్షే కుమారుడు ఆమోసు.
ఆమోసు కుమారుడు యోషీయా.
11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.
12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు.
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు.
అబీహూదు కుమారుడు ఎల్యాకీము.
ఎల్యాకీము కుమారుడు అజోరు.
14 అజోరు కుమారుడు సాదోకు.
సాదోకు కుమారుడు ఆకీము.
ఆకీము కుమారుడు ఎలీహూదు.
15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు.
ఎలియాజరు కుమారుడు మత్తాను.
మత్తాను కుమారుడు యాకోబు.
16 యాకోబు కుమారుడు యోసేపు.
యోసేపు భార్య మరియ.
మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.
17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.
© 1997 Bible League International