Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 140

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

కీర్తనలు. 142

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

కీర్తనలు. 141

దావీదు స్తుతి కీర్తన.

141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
    త్వరపడి నాకు సహాయం చేయుము.
యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
    నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.

యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
    చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
    చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
    అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
    అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.

మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
    అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
    ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
    ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.

కీర్తనలు. 143

దావీదు స్తుతి కీర్తన.

143 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
    నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
    నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
    వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
    నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
    నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
    నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
    యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
    నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
    సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
    నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
    నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
    నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
    నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.

యెషయా 24:14-23

14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు
    యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి!
    దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి!
    యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము.
    ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
కానీ నేనంటాను: “చాలు,
    నాకు సరిపోయింది!
నేను చూస్తున్న సంగతులు భయంకరం.
    దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”

17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది.
    వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు.
    వారు భయపడిపోతారు.
కొంతమంది ప్రజలు పారిపోతారు.
    కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు
వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు.
    కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.
పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి.
    వరదలు మొదలవుతాయి.
    భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
19 భూకంపాలు వస్తాయి.
    భూమి పగిలి తెరచుకొంటుంది.
20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి.
    అందుచేత భూమి ఆ భారం క్రింద పడిపోతుంది.
ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది
    త్రాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది.
    భూమి ఇక కొనసాగలేదు.

21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు
    పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను
    యెహోవా తీర్పు తీరుస్తాడు.
22 ఎందరెందరో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు.
    కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు.
    వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు.
    కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు.
    పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది.
    చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.

1 పేతురు 3:13-4:6

13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.

17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.

18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
    తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
    తీసుకు రావాలని నీతిమంతుడైన
    క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
    ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.

19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.

మారిన జీవితాలు

క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.

కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.

మత్తయి 20:17-28

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మార్కు 10:32-34; లూకా 18:31-34)

17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు: 18 “మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింప బడతాడు. వాళ్ళు ఆయనకు మరణ దండన విధించి, 19 యూదులుకాని వాళ్ళకప్పగిస్తారు. ఆ యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు.”

ఒక తల్లి కోరిన కోరిక

(మార్కు 10:35-45)

20 ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది.

21 యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు.

ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది.

22 యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు.

“త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

23 యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు.

24 మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు. 25 యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. 26 మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. 27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. 28 మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International