Book of Common Prayer
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
తమ పాపాలను ఒప్పుకున్న ప్రజలు
10 ఎజ్రా ఎడతెగకుండా శోకిస్తూ, ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని ఆలయం ముందు విలపిస్తూ సాష్టాంగపడ్డాడు. ఎజ్రా అలా ప్రార్థిస్తూ వుండగా, ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. వాళ్లు కూడా భోరున విలపించసాగారు. 2 అప్పుడు ఏలాము సంతతివాడైన యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము దేవునికి విశ్వాస పాత్రంగా వ్యవహరించలేదు. మేము మా చుట్టూ వున్న పరాయి జాతుల స్త్రీలను పెండ్లాడాము. అయితే, మేమీ పని చేసినా కూడా, ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశవుంది. 3 ఇప్పుడిక్కడ మనం మన దేవుని ముందు ఆ స్త్రీలను, వాళ్ల పిల్లలను అందర్నీ బయటికి పంపేస్తామని ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకుగాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము. 4 ఎజ్రా, నీవు లే, ఇది నీ బాధ్యత, అయితే, మేమూ నీకు తోడ్పాటు ఇస్తాము. అందుకని నీవు ధైర్యంగా వుండి ఈ పని నిర్వహించు.”
5 అప్పుడు ఎజ్రా లేచి నిలబడ్డాడు. ముఖ్య యాజకుల చేత, లేవీయుల చేత, ఇశ్రాయేలీయులందరి చేత తాను చెప్పినది చేస్తామని వాగ్దానం చేయించుకున్నాడు. 6 తర్వాత, ఎజ్రా దేవుని ఆలయం ముందునుంచి ఎల్యాషీబు కొడుకు యోహానాను గదికి వెళ్లాడు. ఎజ్రా అక్కడ వున్నప్పుడు తిండి తినలేదు, నీరు తాగలేదు. యెరూషలేముకి చెరనుండి తిరిగి వచ్చిన ప్రజలు చేసిన దేవుని చట్ట ఉల్లంఘన విషయంలో ఇంకా చాలా దుఃఖితుడై పున్న కారణంగానే, అతనలా తిండి ముట్టకుండా ఉండిపోయాడు. 7 అటు తర్వాత, అతను యూదా, యెరూషలేములలో అన్నిచోట్లా చాటింపు వేయించాడు. ఆ చాటింపు సందేశంలో నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూద వ్యక్తులందరూ యెరూషలేములో సమావేశమవ్వాలని పేర్కొనబడింది. 8 మూడు రోజుల్లో అలా యెరుషలేముకి రాని వ్యక్తి తన ఆస్తినంతటినీ వదులుకోవలసివుంటుంది. అతను నివసిస్తున్న ప్రజాబృందం నుంచి వెలివేయ బడతాడు. ముఖ్య అధికారులూ, యూదా పెద్దలూ (నాయకులూ) యెరూషలేము వెళ్లాలని నిర్ణయం చేశారు.
9 దానితో, మూడు రోజుల్లో యూదా, బెన్యామీను వంశాలకు చెందిన పురుషులందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. తొమ్మిదోనెల[a] ఇరవయ్యవ రోజున ప్రజలందరూ దేవాలయ ఆవరణలో సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం దృష్ట్యానూ, భారీ వర్షం మూలంగానూ వాళ్లందరూ ఎంతో కలవరపడ్డారు. 10 అప్పుడు ఎజ్రా యాజకుడు ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు. 11 మీరిప్పుడు నేరం చేసినట్లు యెహోవా ముందు ఒప్పుకోవాలి. యెహోవా మీ పూర్వీకుల దేవుడు. మీరు యెహోవా ఆజ్ఞను పాటించాలి. మీరు మీ చుట్టూ నివసించే అన్య ప్రజలనుంచీ, విదేశీ భార్యలనుంచీ వేరుపడాలి.”
12 అప్పుడు అక్కడ కూడిన అందరూ ఎజ్రాకి బిగ్గరగా ఇలా బదులిచ్చారు, “ఎజ్రా, నీవు చెప్పింది సరైన మాట! మేము నీవు చెప్పిన పనులు చెయ్యాలి. 13 అయితే, ఇక్కడ చాలామంది వున్నారు. ఇది వర్షాకాలం. మేమిక్కడ బయట నిలబడి వుండటం కష్టం. మేము చాలా తీవ్రమైన పాపం చేశాము. అందుకని, ఈ సమన్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించడం సాధ్యంకాదు. 14 ఇక్కడ సమావేశమైన వాళ్లందరి తరపున మా నాయకుల్ని నిర్ణయం తీసుకోమనండి. అటు తర్వాత, మా పట్టణాల్లో విదేశీ స్త్రీని పెళ్లి చేసుకున్న ప్రతివ్యక్తి ఒక నిర్ణీత సమయంలో యెరూషలేముకు రావాలి. వాళ్లు ఇక్కడికి తమ పెద్దలతో (నాయకులు) న్యాయాధిపతులతో కలిసి రావాలి. అప్పుడు మనపట్ల దేవుని కోపం ఆగుతుంది.”
15 కొద్దిమంది మాత్రమే ఈ ఏర్పాటును వ్యతిరేకించారు. అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యాయు. మెషుల్లాము, షబ్బెతైయు కూడా యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
16 చెరనుంచి యెరూషలేముకు తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. యాజకుడు ఎజ్రా ఆయా వంశాల నాయకులను ఎంపికచేశాడు. అతను ఒక్కొక్క వంశం నుంచి ఒక్కొక్కరిని పేరు వరుసన ఎన్నుకున్నాడు. పదవ నెల[b] మొదటి రోజున ఎంపిక చేయబడిన వ్యక్తులు కూర్చుని ఒక్కొక్కరి విషయాన్ని విచారణ చేయనారంభించారు. 17 మొదటి నెల[c] మొదటిరోజు నాటికి విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందర్ని గురించీ చర్చలు ముగించారు.
పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం
10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”
నీకు ప్రతిఫలము దొరుకుతుంది
12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.
పెద్ద విందు ఉపమానం
(మత్తయి 22:1-10)
15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
© 1997 Bible League International