Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

కీర్తనలు. 53

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

ఎజ్రా 6

దర్యావేషు ఆజ్ఞ

దర్వావేషు రాజు తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి. మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం[a] లో యిలా వ్రాయబడి వుంది:

అధికార పత్రం: కోరెషు రాజు పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ క్రింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొనబడింది:

బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.) దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణానికయ్యే ఖర్చులు రాజు ఖజానానుంచి చెల్లించాలి. అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.

ఇప్పుడిక దర్యావేషునైన నేను,

యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తత్తెనైయు, షెతర్బోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.

ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ క్రింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి. వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.

11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.

12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను.

జాగ్రత్త, ఇది నా (దర్యావేషు రాజు) తిరుగులేని ఆజ్ఞ. దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!

దేవాలయ నిర్మాణ పనిపూర్తి, ప్రతిష్ఠ

13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధికారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు రాజు ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. 14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే. 15 దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున[b] దర్వావేషు రాజు పాలన ఆరవ ఏట[c] పూర్తయింది.

16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.

17 వాళ్లు దేవాలయ ప్రతిష్ఠ పండుగను యిలా జరుపుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగాయిచ్డారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 12 వంశాల ఇశ్రాయేలీయులకు. 18 అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలోని నిబంధనల ప్రకారం చేశారు.

పస్కా పండుగ

19 [d] మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు. 20 యాజకులు, లేవీయులు ఆ రోజున తమను తాము శుద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండుగ నాడు చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. లేవీయులు నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం పస్కా పండుగ గొర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం ఇచ్చారు. 21 అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు. 22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు[e] మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.

ప్రకటన 5:1-10

గ్రంథము, గొఱ్ఱెపిల్ల

ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.

అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు:

“నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి,
    ప్రతి దేశంనుండి,
ప్రతి గుంపునుండి,
    నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు.
    కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు.
    వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”

మత్తయి 13:10-17

యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు

(మార్కు 4:10-12; లూకా 8:9-10)

10 శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.

11 ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. 12 దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. 13 నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. 14 తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది:

‘మీరు తప్పక వింటారు,
    కాని అర్థంచేసుకోలేరు.
మీరు తప్పక చూస్తారు
    కాని గ్రహించలేరు.
15 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని,
    హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే
    నేను వాళ్ళను నయం చేస్తాను.
కాని అలా జరుగరాదని
    ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి.
    వాళ్ళకు బాగా వినిపించదు.
    వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’(A)

16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. 17 ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International