Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 18

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.

18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
    అతడీలాగన్నాడు.

యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
    నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
    ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

యెహోవాకు నేను మొరపెడ్తాను.
    యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
    మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
    మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
    నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
    నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
    సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు.
    భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి.
    ఎందుకంటే ప్రభువు కోపించాడు.
ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది.
    యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి.
    నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.
యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు.
    ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.
10 ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు.
    ఆయన గాలుల మీద పైకెగిరాడు.
11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మేఘంలో ఆయన మరుగైయున్నాడు.
    దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.
12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది.
    అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.
13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది.
    సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు,
    అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.

15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు,
    మరియు నీవు నీ నోటినుండి[a] బలమైన గాలిని ఊదావు.
నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము.
    భూమి పునాదులను మేము చూడగలిగాము.

16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు.
    నా కష్టాల్లోనుండి[b] ఆయన నన్ను బయటకు లాగాడు.
17 నా శత్రువులు నాకంటె బలవంతులు.
    ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.
18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు.
    కాని యెహోవా నన్ను బలపర్చాడు.
19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు.
    ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.
20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
    నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
    నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
    ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
    నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
    నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.

25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
    మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
    కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
    కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
    నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
    నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.

30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
    ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.
    మన దేవుడు తప్ప మరో బండ[c] లేదు.
32 దేవుడు నాకు బలం ఇస్తాడు.
    ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
33 దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె ఉంచుతాడు.
    ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు.
    ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.
34 యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు.
    ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు.

35 దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి.
    నీ కుడిచేతితో నన్ను బలపరుచుము.
    నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది.
36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు.
    నా పాదాలు జారిపోలేదు.

37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను.
    వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.
38 నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు.
    నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు.
39 దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము.
    నా శత్రువులంతా నా యెదుట పడిపోయేటట్టు చేయుము.
40 యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు.
    నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను.
41 నా శత్రువులు సహాయం కోసం అడిగారు,
    కాని ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు.
వారు యెహోవాకు కూడా మొరపెట్టారు.
    కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు.
42 నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను.
    వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను.

43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.
    ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము.
    నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.
    ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,
    కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు.
    వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.

46 యెహోవా సజీవంగా ఉన్నాడు.
    నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు.
    అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.
    ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
48     యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.

కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు.
    నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.
    నీ నామ కీర్తన గానము చేస్తాను.

50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు,
    తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.

యిర్మీయా 38:1-13

యిర్మీయా నీళ్లగోతిలోనికి తోయబడటం

38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”

ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు.

“యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.

దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి[a] దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.

కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా)[b] రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 8-9 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”[c]

10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు[d] మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”

11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. 12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. 13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు.

1 కొరింథీయులకు 14:26-33

నియమాలు

26 సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి. 27 తెలియని భాషల్లో మాట్లాడగలిగేవాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి. 28 అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటం మానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు.

29 దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పినదాన్ని జాగ్రత్తగా గమనించాలి. 30 ఒకవేళ అక్కడ కూర్చున్నవాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి. 31 అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది. 32 దైవసందేశం చెప్పేవాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు. 33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.

1 కొరింథీయులకు 14:37-40

37 దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి. 38 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు.[a]

39 సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడేవాళ్ళను ఆపకండి. 40 కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.

మత్తయి 10:34-42

యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును

(లూకా 12:51-53; 14:26-27)

34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,

‘తండ్రి కుమార్ల మధ్య,
    తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
    విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)

37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.

నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును

(మార్కు 9:41)

40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International