Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

కీర్తనలు. 128-130

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

2 రాజులు 22:14-23:3

యోషీయా మరియు ప్రవక్త్రి అయిన హుల్దా

14 అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, అక్బోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్హను కుమారుడు తిక్వా కుమారుడైన షల్లూము భార్యయే హుల్దా. అతను యాజకుల వస్త్రాలను జాగరూకతతో చూస్తున్నాడు. హుల్దా యెరూషలేములో రెండవ ప్రదేశంలో నివసిస్తున్నది. వారు హుల్దా వద్దకు పోయి మాట్లాడారు.

15 తర్వాత హుల్దా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా వద్దకు పంపిన మనిషితో చెప్పు. 16 యెహోవా ఇలా చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలానికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించబడ్డవి. 17 యూదా ప్రజలు నన్ను విడిచి పెట్టారు. ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు తయారు చేశారు. అందువల్ల ఈ స్ధలము పట్ల నా కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్పశక్యము కానట్టి నిప్పు వంటిది.”

18-19 “యూదా రాజైన యోషీయా యెహోవా యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. యోషీయాకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ హృదయము మృదువైనది. ఈ విషయాలు వినగానే నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) భయంకర సంఘటనలు జరుగుతాయని నేను చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు చింపావు. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు. 20 నీ పూర్వికులతో వుండడానికి నేను నిన్ను తీసుకువస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూషలేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడవు.”

అప్పుడు యాజకుడు హిల్కీయా, అహికాము, అక్బోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకు ఆ సందేశము చెప్పారు.

ప్రజలు ధర్మశాస్త్రము వినుట

23 యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.

రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.

1 కొరింథీయులకు 11:23-34

23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని 24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. 25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి” అని అన్నాడు. 26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.

27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.

33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.

మత్తయి 9:9-17

మత్తయిని పిలవటం

(మార్కు 2:13-17; లూకా 5:27-32)

యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.

10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.

12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మార్కు 2:18-22; లూకా 5:33-39)

14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.

16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International