లూకా 7:18-35
Telugu Holy Bible: Easy-to-Read Version
యోహాను అడగటానికి పంపిన ప్రశ్న
(మత్తయి 11:2-19)
18 యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని గురించి చెప్పారు. 19 అతడు తన శిష్యుల్లో యిద్దర్ని పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగిరమ్మని పంపాడు.
20 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’” అని అన్నారు.
21 వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగగ్రస్తులకు, బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేశాడు. చాలా మంది గ్రుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు. 22 యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి. 23 నన్ను విశ్వసించటానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని అన్నాడు.
24 ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాలకు ఏం చూడాలని వెళ్ళారు? రెల్లు గాలికి కదలటం చూడాలని వెళ్ళారా? 25 ఏమి చూడాలని వెళ్ళారు? విలువైన వస్త్రాల్ని ధరించిన వాళ్ళనా? విలువైన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు. 26 మరి ఏమి చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? ఔను, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 27 యోహానును గురించి లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
‘ఇతడు నా దూత, ఇతణ్ణి నీ కన్నా ముందుగా పంపుతాను.
ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.’(A)
28 యోహాను ప్రపంచములో పుట్టిన మానవులందరి కన్నా గొప్పవాడు. కాని దేవుని రాజ్యంలో అందరికన్నా అల్పుడు యోహాను కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.”
29 (యోహాను బోధనలు విని ప్రజలు, చివరకు పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా, యోహాను ద్వారా బాప్తిస్మము పొందారు. తద్వారా వాళ్ళు దేవుడు సంకల్పించినట్లు చేసారు. 30 కాని పరిసయ్యులు, శాస్త్రులు యోహాను చేత బాప్తిస్మము పొందటానికి నిరాకరించారు. తద్వారా వాళ్ళు దేవుడు తమకోసం సంకల్పించిన దాన్ని నిరాకరించారు.)
31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? 32 వాళ్ళు సంతలో కూర్చొని,
‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము.
కాని మీరు నాట్యం చేయలేదు.
మేము చనిపోయిన వానికోసం పాట పాడాము.
కాని మీరు దుఃఖించలేదు.’
అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. 34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”
Read full chapter© 1997 Bible League International