యోహాను 18:39-19:16
Telugu Holy Bible: Easy-to-Read Version
39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.
40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.[a]
19 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు. 2 భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. 3 ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.
4 పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు. 5 యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.
6 ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు.
కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
7 కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.
8 పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. 9 అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. 10 పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు.
11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.
12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.
13 ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. 14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.
15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు.
పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు.
ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.
16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.
Footnotes
- 18:40 బందిపోటు దొంగ అనగా రోమా రాజద్రోహి, హంతకుడు.
© 1997 Bible League International