2 పేతురు 3:1-10
Telugu Holy Bible: Easy-to-Read Version
యేసు మరలా వస్తాడు
3 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. 2 పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: 4 “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది. 6 నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. 7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.
8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి.
Read full chapterFootnotes
- 3:8 కీర్తన. 90:4 చూడండి.
© 1997 Bible League International