యోబు 20
Telugu Holy Bible: Easy-to-Read Version
జోఫరు జవాబు
20 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి.
నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.
3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకరంగా ఉన్నాయి.
కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు.
4-5 “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి
ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే.
దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది.
6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు.
అతని తల మేఘాలను తాకవచ్చు.
7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు.
అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అంటారు.
8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు.
ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు వదిలించబడతాడు.
9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు
అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.
10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు.
దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.
11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంటుంది.
కాని త్వరలోనే అది మట్టి అవుతుంది.
12 “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది.
అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు.
13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం.
కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.
14 కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది.
అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది.
15 దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు.
అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు.
16 దుష్టుడు పాముల విషం పీల్చుతాడు.
పాము కోరలు వానిని చంపివేస్తాయి.
17 అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి
దుష్టుడు ఆనందించ లేడు.
18 దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు.
అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు.
19 దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక, అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు.
ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు.
20 దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు.
వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు.
21 అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు.
అతని విజయం కొనసాగదు:
22 దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు.
అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి.
23 దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత
దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు.
దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు.
24 ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారిపోతాడేమో
కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.
25 ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది.
ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది.
అతడు భయంతో అదిరిపోతాడు.
26 అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి.
ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది.
అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది.
27 దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది.
భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.
28 అతని ఇంట్లో ఉన్న సమస్తం
దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.
29 దుర్మార్గునికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే.
దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”
© 1997 Bible League International