యెషయా 63
Telugu Holy Bible: Easy-to-Read Version
యెహోవా తన జనాంగాన్ని శిక్షిస్తాడు
63 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు?
ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు.
అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు.
అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు.
“మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను”
అని అతడు చెబుతున్నాడు.
2 “నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి?
ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”
3 అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను.
నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు.
నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను.
ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.
4 ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను.
నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
5 చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు.
నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను.
నా కోపమే నాకు బలం ఇచ్చింది.
6 నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను.
నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”
యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు
7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను.
ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు.
యెహోవా మా యెడల చాలా దయచూపించాడు.
యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”
అని యెహోవా చెప్పాడు.
కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
9 ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి.
కానీ యెహోవా వారికి విరోధంగా లేడు.
యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు.
కనుక యెహోవా ప్రజలను రక్షించాడు.
వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు.
మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు.
ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు.
అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు.
యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.
11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం.
సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే.
యెహోవా తన మందను (ప్రజలను) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు.
అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ?
12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు.
ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు
యెహోవా నీళ్లను పాయలు చేశాడు.
ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల
యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు.
13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు.
ప్రజలు పడిపోకుండా నడిచారు.
అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు.
14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు.
అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు.
ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించాడు.
అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది.
ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.
తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన
15 యెహోవా, పరలోకము నుండి చూడుము.
ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము.
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము.
మా మీద నీ బలమైన ప్రేమ ఏది?
నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి?
నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
16 చూడు, నీవు మా తండ్రివి!
మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు.
ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు.
యెహోవా, నీవు మా తండ్రివి.
మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.
17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు త్రోసివేస్తున్నావు?
మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు?
యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము.
మేము నీ సేవకులం.
మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి.
మా కుటుంబాలు నీకు చెందినవి.
18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి.
మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.
19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు.
ఆ ప్రజలు నీ నామం ధరించరు.
మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.
© 1997 Bible League International