యెషయా 18
Telugu Holy Bible: Easy-to-Read Version
ఇథియోపియాకు దేవుని సందేశం
18 ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. 2 ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది.
వేగంగా పోయే సందేశహరులు,
ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు.
(ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం.
వారు బలంగల రాజ్యం.
వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది.
నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
3 వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి.
ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు.
ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు.
ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు.
యుద్ధానికి ముందు ఊదే శంఖంలా
వారు దీనిని తేటగా వింటారు.
4 యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. 5 అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు. 6 కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.”
7 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
© 1997 Bible League International