Add parallel Print Page Options

దర్మార్గపు రాజులకు వ్యతిరేకంగా తీర్పు

22 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు. ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి. యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు. ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారి అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు. కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”

యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే:

“గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది
    లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది
కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను.
    నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.
ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను.
    ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది.
అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను వారు నరికి వేస్తారు.
    నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.

“ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం ప్రక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమునకు ఎందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు. దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”

యెహోయాహాజురాజు (షల్లూము)కు వ్యతిరేకంగా తీర్పు

10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు.[a]
    అతని కొరకు విచారించవద్దు.
కాని ఇక్కడ నుండి వెళ్లి పోయే రాజు కొరకు
    మిక్కిలిగా దుఃఖించండి.[b]
అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే అతడు మరి తిరిగి రాడు.
    యెహోయాహాజు తన మాతృ భూమిని మరల చూడడు.

11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు. 12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”

రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా తీర్పు

13 “రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు.
    తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు.
    పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు.
    నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు.
    వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.

14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను.
    ‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు.
అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు.
    వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.

15 “యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప
    నిన్ను గొప్ప రాజును చేయదు.
నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు.
    అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు.
    యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు.
    యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది.
యెహోయాకీమా, ‘దేవుని తెలుసు కొనుట’ అంటే ఏమిటి?
దీనులకు దరిద్రులకు సహాయం చేయటం
    మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.”
ఇదే యెహోవా వాక్కు.

17 “యెహోయాకీమా, నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి.
    ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది.
అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు
    ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్టపడుతున్నావు.”

18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా:
    “యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను!
    అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’
అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు.
యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు.
‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
    ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’
    అని వారతనిని గురించి చెప్పరు.
19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు.
    అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.

20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి.
    నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి.
అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు.
    ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.

21 “యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావించావు.
    కాని నిన్ను నేను హెచ్చరించాను!
నేను నిన్ను హెచ్చరించినా
    నీవు లక్ష్యపెట్టలేదు!
నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు.
యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు
22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది.
    అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది.
ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు.
కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి.
    అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది.
నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.

23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు.
    ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది.
కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు
    సురక్షితం అనుకుంటున్నావు.
కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు.
    స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”

యెహోయాకీను (కొన్యా) పై తీర్పు

24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను! 25 యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు. 26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు. 27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు. నీవు వచ్చుటకు నేను అనుమతించను.”

28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది.
    ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు.
యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు?
    వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?
29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా!
    యెహోవా వర్తమానం వినుము!
30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి:
    ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క!
తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు.
    అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు.
అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”

Footnotes

  1. 22:10 చనిపోయిన … దుఃఖించవద్దు క్రీ. పూ. 609 లో ఈజిప్టీయులతో జరిగిన యుద్ధంలో చనిపోయిన రాజు యోషీయా అని యిక్కడ అర్థం.
  2. 22:10 వెళ్లి పోయే … దుఃఖించండి అనగా యోషీయా కుమారుడైన యెహోయాహాజు యోషీయా చనిపోయిన పిమ్మట యూదాకు రాజైనాడు. ఇతనినే షల్లూము అని పిలుస్తారు. ఈజిప్టు రాజైన నెకో అనునతను యోషీయాను ఓడించాడు. పిమ్మట నెకోరాజు యెహోయాహాజును రాచరికాన్నుండి తొలగించి ఈజిప్టుకు బందీగా తీసికొనిపోయాడు.