Add parallel Print Page Options

సిద్కియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట

21 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు[a] అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు. యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన[b] నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”

అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల[c] నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను.

“‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను. యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు. అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’

“యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబులోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”

11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
    ‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
    నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
    నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
    దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
    గనుక ఇది జరుగుతుంది.’

13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
    నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
    నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
    ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
    ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.

14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
    ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”

Footnotes

  1. 21:1 పషూరు ఈ పషూరు గ్రంథం 20:1 లో తటస్థించిన పషూరు కాడు.
  2. 21:2 బబులోను రాజు నెబుకద్నెజరు అని పాఠాంతరం.
  3. 21:4 కల్దీయుల కల్దీయుల వంశంలోని వాడే నెబుకద్నెజరు. ఆ కాలంలో బబులోను వారి అధీనంలో వుంది.