Add parallel Print Page Options

నేరం గుండెపై వ్రాయబడింది

17 “యూదా ప్రజల పాపం తుడిచి వేయలేని
    చోట వ్రాయబడింది.
వారి పాపాలు ఇనుపకలంతో రాతిలోకి చెక్కబడ్డాయి.
    వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కబడ్డాయి.
    వారి గుండెలే ఆ రాతి ఫలకలు.
బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు
    వారి పిల్లలకు గుర్తున్నాయి.
ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద[a] చెక్కబడినాయి.
అషేరా దేవతకు అంకితం చేయబడిన
    దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి.
కొండలమీద, పచ్చని చెట్లక్రింద జరిగిన
    తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.
మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన
    సంగతులు వారికి గుర్తున్నాయి.
యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి.
    వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను!
మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు.
    ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.
నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు.
    మీ విరోధులు మిమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను.
ఎందువల్లనంటే, నేను చాలా కోపంగా ఉన్నాను.
    నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.”

ప్రజలలో నమ్మిక మరియు దేవునిలో నమ్మిక

యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు:
“ఇతర ప్రజలను నమ్మేవారికి
    కీడు జరుగుతుంది.
బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి
    కష్ట నష్టాలు వస్తాయి.
ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.
ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు.
    ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు.
    ఆ పొద ఎండిన ఉష్ణ ప్రదేశంలో ఉంది.
ఆ పొద చవుడు భూమిలో ఉంది.
    ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
    ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
    ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
    దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
    ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.

“మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి.
    మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది.
    మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.
10 కాని యెహోవానైన నేను
    ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను.
వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను.
    ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.
11 ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే
    వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది.
డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా
    అలాంటి పక్షిలాంటి వాడే.
వాని జీవితం సగంగడిచే సరికి
    వాని ధనం పోతుంది.
తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు
    పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”

12 ఆదినుంచీ మన దేవాలయం
    ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది.
    అది చాలా ముఖ్యమైన స్థలం.
13 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి.
    దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు!
ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు.
    వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది.[b]

యిర్మీయా మూడవ విన్నపం

14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే
    నేను నిజంగా స్వస్థపడతాను!
నన్ను రక్షిస్తే,
    నేను నిజంగా రక్షింపబడతాను.
యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు.
    “యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ?
    ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.

16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారిపోలేదు.
    నేను నిన్ను అనుసరించాను.
    నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను.
ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు.[c]
    యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు.
    జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.
17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు.
    కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.
18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు.
వారిని సిగ్గుపడేలాచేయి.
    కాని నాకు ఆశాభంగం కలుగచేయకుము.
ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము.
    కాని నన్ను మాత్రం పారిపోనీయవద్దు.
ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము.
    వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.

సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించటం

19 యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ‘ముఖద్వారం’[d] వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు లోనికి, బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల వద్దకూ వెళ్లి అలాగే చేయి.”

20 ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ఈ ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి! 21 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు సబ్బాతు దినాన మీరేమీ బరువులు మోయకుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు. 22 మీ ఇండ్లనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను. 23 కాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది వినలేదు. 24 కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.

25 “‘మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు. 26 యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామాలనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి కూడా ప్రజలు వస్తారు[e] పడమట నున్న కొండవాలు ప్రాంతం నుండి, మన్యప్రాంతం నుండి కూడా ప్రజలు వస్తారు. మరియు యూదా దక్షిణ ప్రాంతంనుండి కూడా నెగెవు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞతార్పణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, ధూపద్రవ్వాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను యెహోవా ఆలయానికి తెస్తారు.

27 “‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”

Footnotes

  1. 17:2 ఆ పాపాలన్నీ … కొమ్ములమీద బలిపీఠం మూలలు కొమ్నుల ఆకారంలో మలచబడతాయి. ఇది ప్రజలకు రక్షణ కల్పించే ప్రదేశం. తప్పు చేసినవాడెవడైనా ఇచ్చటికి పరుగునరావచ్చు. ఆ వచ్చినవాడు నేరుస్థుడని నిరూపించబడినాకనే వాడు శిక్షకు అర్హుడు. ఇక్కడ యిర్మీయా యూదా ప్రజలకు రక్షణ స్థలమేదీలేదని చెప్పుచున్నాడు.
  2. 17:13 వారు … తగ్గిపోతుంది అతడు దుమ్ములో వ్రాయబడతాడని శబ్దార్థం. అనగా వానిపేరు త్వరలో చనిపోయే వారి పట్టికలో వ్రాయబడుతుందని అర్థం. లేదా ఇసుకలో వ్రాసిన పేరులా వాని జీవితం క్షణంలో మాయమవుతుంది, అని పాఠాంతరం.
  3. 17:16 ఆ భయంకరమైన … కోరుకోలేదు రాబోతున్న విపత్తును గురించి యిర్మీయా ప్రవచనాలిచ్చాడు, కాని అవి నెరవేరాలని అతను ఇష్టపడలేదు.
  4. 17:19 ముఖద్వారం యెరూషలేము నగర ప్రతి ద్వారానికి ఒక పేరు వుంటుంది.
  5. 17:26 బెన్యామీను … వస్తారు బెన్యామీను రాజ్యం యూదా రాజ్యానికి ఉత్తర భాగానవున్నది.