కీర్తనలు. 60
Telugu Holy Bible: Easy-to-Read Version
సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.
60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
మా ప్రపంచం పగిలిపోతోంది.
దయచేసి దాన్ని బాగు చేయుము.
3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
5 నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
6 దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
“నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
యూదా నా రాజదండము.
8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
దేవుడు మా శత్రువులను ఓడించగలడు.
Footnotes
- 60:6 దేవుడు … నుండి ఆయన ఆలయమునుండి లేదా “ఆయన పరిశుద్ధతలో.”
© 1997 Bible League International