Add parallel Print Page Options

సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
    కోపగించి నన్ను శిక్షించవద్దు.
యెహోవా, నా మీద దయ ఉంచుము.
    నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
    నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
    నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
    సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
    నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
    నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
    ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
    ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.

చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
    ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
    వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.