Add parallel Print Page Options

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
    నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
    మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.

యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
    బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
    నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
    నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
    నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
    సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
    నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
నీవు కనబడినప్పుడు
    ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
    మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
    వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
    చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
    ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
    మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.