ఓబద్యా
Telugu Holy Bible: Easy-to-Read Version
ఎదోముకు శిక్ష
1 ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును[a] గురించి ఈ విషయం చెప్పాడు:
దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము.
వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
“మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.
ఎదోముతో యెహోవా మాట్లాడటం
2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.
ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
3 నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు.
నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది.
అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’
అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”
ఎదోము తగ్గంచబడుతుంది
4 దేవుడైన యెహోవా ఇది చెప్పాడు:
“నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా,
నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా,
అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను
5 నీవు నిశ్చయంగా నాశనమవుతావు!
దొంగలు నీవద్దకు వస్తారు!
రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు!
ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు!
ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు,
వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు.
6 ఏశావు[b] రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు.
వాటిని వారు కనుగొంటారు!
7 నీ స్నేహితులైన ప్రజలంతా
నిన్ను దేశంనుండి పంపివేస్తారు.
నీతో సంధి చేసుకొన్నవారు
నిన్ను మోసగించి, ఓడిస్తారు.
నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు,
నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు.
వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’”
8 యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున
ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును.
9 తేమానూ, నీ యోధులు భయపడతారు.
ఏశావు పర్వతంమీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు.
అనేక మంది చంపబడతారు.
10 అవమానం నిన్ను ఆవరిస్తుంది.
నీవు శాశ్వతంగా నాశనమవుతావు.
ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబుపట్ల చాలా క్రూరంగా ఉన్నావు.
11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు
ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు.
పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి,
యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు.
ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు.
12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు.
నీవాపని చేసియుండకూడదు.
ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు.
నీవలా చేసియుండకూడదు.
యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు.
నీవది చేసియుండకూడదు.
13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి,
నీవు వారి సమస్యలను చూసి నవ్వావు.
నీవది చేసియుండకూడదు.
వారికి కష్టకాలం వచ్చినప్పుడు.
నీవు వారి ఆస్తిని దోచుకున్నావు.
నీవాపని చేసియుండకూడదు.
14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు.
నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునేవారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు.
నీవాపని చేయకుండా ఉండవలసింది.
15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది.
నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు.
అదే కీడు నీకూ జరుగుతుంది.
అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.
16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు.
అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు.
నువ్వు అంతరిస్తావు
నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది.
17 కాని సీయోను కొండమీద మాత్రం మిగిలినవారు ఉంటారు.
వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.
యాకోబు వంశం తనకు చెందిన
వస్తువులను తిరిగి తీసుకొంటుంది.
18 యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది.
యోసేపు[c] సంతతివారు మంటలా తయారవుతారు.
కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది.
యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు.
యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు.
అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.”
దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
19 యూదాకు దక్షిణానగల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు.
కొండకింది (మైదాన) ప్రాంతంవారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు.
ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు.
గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది.
20 ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలిపోయేలా ఒత్తిడి చేయబడ్డారు.
కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు.
యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు
దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించుకొంటారు.
21 జయించినవారు సీయోను కొండమీద ఉంటారు
ఆ మనుష్యులు ఏశావు కొండమీద నివసిస్తున్న వారిని పరిపాలిస్తారు.
అప్పుడు రాజ్యం యెహోవాకు చెంది ఉంటుంది.
© 1997 Bible League International