మత్తయి 14:13-21
Telugu Holy Bible: Easy-to-Read Version
అయిదువేల మందికి భోజనం
(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.
15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.
17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
Read full chapter© 1997 Bible League International