మత్తయి 14:1-12
Telugu Holy Bible: Easy-to-Read Version
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మార్కు 6:14-29; లూకా 9:7-9)
14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. 2 అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.
యోహాను తల నరకటం
3 అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. 4 పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. 5 ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.
6 హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. 8 ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.
9 ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
Read full chapter© 1997 Bible League International