మార్కు 9:14-29
Telugu Holy Bible: Easy-to-Read Version
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మత్తయి 17:14-20; లూకా 9:37-43)
14 యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్ళతో ఏమో వాదిస్తూ ఉండటం చూసారు. 15 యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు.
16 యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తున్నారు” అని అడిగాడు.
17 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. 18 ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు.
19 యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు.
20 వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు.
21 యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు.
“చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు. 22 “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు.
23 యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు.
24 వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయపడండి చెయ్యండి” అన్నాడు.
25 యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు.
26 ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపొయ్యాడనుకొన్నారు. 27 కాని, యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచోబెట్టాడు.
28 ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెందుకు వెళ్ళగొట్టలేక పొయ్యాము?” అని అడిగారు.
29 యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో[a] మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.
Read full chapterFootnotes
- 9:29 ప్రార్థనతో కొన్ని గ్రీకు ప్రతులలో, “ప్రార్థన మరియు ఉపవాసము” అని ఉంది.
© 1997 Bible League International