మార్కు 14:66-72
Telugu Holy Bible: Easy-to-Read Version
పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం
(మత్తయి 26:69-75; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)
66 పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది. 67 పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది.
68 అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.
69 ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో, “ఇతడు వాళ్ళలో ఒకడు” అని మళ్ళీ అన్నది. 70 మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు.
కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు.
71 పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
72 వెంటనే రెండవసారి[a] కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు.
Read full chapterFootnotes
- 14:72 రెండవసారి కొన్ని గ్రీకు ప్రతులలో “రెండు” అన్న సంఖ్య లేదు.
© 1997 Bible League International