Add parallel Print Page Options

యాకోబు మరియు యోహానుల నివేదన

(మత్తయి 20:20-28)

35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.

36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.

37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.

38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.

39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.

41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.

Read full chapter