Add parallel Print Page Options

యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు. కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను[a] వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు. ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయి, విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు. అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది.

ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.

ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారితో చెప్పారు.

హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు.

అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.

అప్పుడు ఆ మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని గూర్చి మేము విన్నాం. 10 యొర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. 11 కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.

12 “మా రొట్టెలు చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇవి ఎండిపోయి ఉన్నట్లు మీరు చూడగలరు. 13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”

14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు. 15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.

Read full chapter

Footnotes

  1. 9:4 ద్రాక్షారసపు తిత్తులను జంతువుల చర్మంతో చేసిన ఈ సంచులలో ద్రాక్షారసమును నింపి వుంచుతారు.